5, ఏప్రిల్ 2025, శనివారం

Social Media Effects : సోషల్ మీడియా - రెండు వైపులా పదును ఉన్న కత్తి

 


                                                                 
Social Media Effects

📌 సమాజంపై సోషల్ మీడియా యొక్క స్థిరమైన బలహీనతలు & ప్రభావాలు

ప్రస్తుతం మనం జీవిస్తున్న సమాజం ‘డిజిటల్ ఆధారిత సమాజం’గా మారిపోయింది. పాత కాలంలో సమాచారం,విజ్ఞానం  కోసం వార్తాపత్రికలు, సినిమాలు, టీవీలు మాత్రమే  ఆధారంగా ఉండేవి. కానీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో  ఇప్పుడు ఒక్క సెల్‌ఫోన్ ఉంటే చాలు యావత్ ప్రపంచమే  మన చేతిలో ఇమిడి పోతుంది. ఇందులో కీలక పాత్ర పోషించేది – సోషల్ మీడియా. ఒక వ్యక్తి నుండి ప్రపంచ స్థాయి సంస్థలు, వ్యవస్థల వర్తమానాన్ని, భవిష్యత్ ను క్షణాలలో తలక్రిందులు చేసేస్తున్నసాంకేతిక  సాధనం. మారు మూల కుగ్రామం లోని ఒక సాధారణ వ్యక్తిని రాత్రికి రాత్రి ప్రపంచ ప్రభావ శీల వ్యక్తిని చేయగలదు. ప్రపంచస్థాయి సెలబ్రిటీలను సైతం గంటల వ్యవధిలో బికారులను చేయగలదు. రెండు వైపులా పదును ఉన్న చురుకైన  కరవాలం  ఈ సోషల్ మీడియా . ఈ కత్తి వైద్యుని చేతిలో ఉంటే ప్రాణం పోస్తుంది..ఉన్మాది చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది. వినియోగించే విధానం బట్టే సోషల్ మీడియా ప్రభావం ఆధారపడి ఉంటుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి  మెలగాలి.


👍సోషల్ మీడియా సానుకూల ప్రభావాలు  – Positive Side of Social Media


1. 📣 వ్యక్తి అభివృద్ధికి తోడ్పాటు

తమలో దాగివున్న  విషయాలను, కళలను, ప్రతిభను ప్రపంచానికి చూపించుకోవడం ద్వారా వ్య‌క్తి ఎదుగుదలకు పెద్ద అవకాశాలు లభిస్తున్నాయి.

ఉదాహరణ: ఒక చిన్న గ్రామంలో పుట్టిన సంగీత కళాకారుడు తన పాటలను YouTube లో పోస్ట్ చేయడం ద్వారా మిలియన్ల మంది దృష్టిని ఆకర్షించగలడు. బాలీవుడ్ లేడీ సింగర్ రేణు మండల్ ( Renu Mandal ) ఒక తాజా ఉదాహరణ. ఒక బిచ్చగత్తె సోషల్ మీడియా ప్రభావంతో అతి తక్కువ కాలంలోనే విస్తృత ప్రజాదరణ పొంది బాలీవుడ్ లో సింగర్ గా ఖ్యాతి సంపాదించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోక పోవడంతో అదే సోషల్ మీడియా ట్రోలింగ్ కు లక్ష్యంగా మారి అంతే వేగంగా కీర్తి మసకబారింది. 


2. 💼 ఉద్యోగాలు – ఉపాధికి మార్గం

  • డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ వంటి కొత్త ఉద్యోగ రంగాలు ఏర్పడ్డాయి.

  • Influencer Marketing ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్న యువత.


3. 🏃‍♂️ సామాజిక ఉద్యమాలు – ప్రజల శక్తి

  • సోషల్ మీడియా ద్వారా సామాజిక సమస్యలు వెలుగులోకి రావడం, ఉద్యమాలు ప్రారంభమవడం చూస్తున్నాం.

  • #MeToo, #JusticeForVictims వంటి హ్యాష్‌ట్యాగ్ ఉద్యమాలు దీనికి ఉదాహరణలు.


4.  సాంస్కృతిక, భాషా పరిరక్షణ

స్వదేశీ భాషలు, సంప్రదాయాలు, పాత పాటలు, నాటకాలు మొదలైన వాటిని యువతకు పరిచయం చేయడంలో సహాయపడుతోంది.


👎 సోషల్ మీడియా చీకటి కోణం  – Negative Side of Social Media

1.  సమయ నష్టం

సోషల్ మీడియాలో గంటల తరబడి విపరీతంగా టైం పాస్ చేయడం వలన వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి నష్టం కలుగుతోంది.


2.  ఆత్మనింద, డిప్రెషన్

ఇతరుల పోస్టులు ఆదరణ, ఆమోదం చూసి తమను తాము తక్కువగా ఫీల్ అవడం, డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ఉదాహరణ: ఒక యువతి తనకు సోషల్ మీడియా లో అతి తక్కువ సంఖ్యలో  ఫాలోవర్లు ఉన్నారనే కారణంతో మానసికంగా బాధపడింది.


3. 📲 ఫేక్ న్యూస్ మాఫియా

తప్పు సమాచారం వేగంగా వ్యాప్తి చెయ్యబడుతున్నది. వార్తా కథనాల ప్రసారంలో తగిన పర్యవేక్షణ కొరవడడం, విపరీత స్వేచ్చ కొన్నిసార్లు ఇది సామాజిక అశాంతికి దారితీస్తోంది.


4. సైబర్ నేరాలు – ప్రమాదకరం

సోషల్ మీడియా ద్వారానే వ్యక్తిగత డేటా దొంగిలింపు, ఫేక్ ప్రొఫైల్స్, చెత్త ఫోటోలు షేర్ చేయడం వంటి నేరాలు పెరుగుతున్నాయి.


5.  పిల్లల భవిష్యత్తుపై ప్రభావం

నేటి పిల్లలు, టీనేజర్లు చదువును వారి భవిష్యత్ ను ఉజ్వలం చేసే ఉద్యోగ, ఉపాధి అవకాసాలను నిర్లక్ష్యం చేస్తూ    సోషల్ మీడియాపై ఎక్కువ సమయం గడిపే దిశగా వెళ్తున్నారు.


👦👧 యువతపై విస్తృత  ప్రభావం – A Closer Look

📌 "అనుసరణతో తిప్పలు " – Influencer Pressures

అధిక శాతం  యువత Instagram/Facebook/YouTube లో విపరీతంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌లను అనుసరిస్తూ వారిలా మారాలనుకుంటున్నారు. ఇది వారి స్వభావాన్ని, ప్రామాణికతను నాశనం చేస్తోంది. ఒకరిని స్ఫూర్తిగా తీసుకోవడంలో ఎటువంటి ఆక్షేపణ ఉండకపోగా అది ఒక చక్కని ప్రోత్సహపురిత వ్యక్తిత్వాన్ని అందిస్తుంది. ఒకరిని అనుకరించాలని ప్రయత్నించడమే పక్కదారి పట్టిస్తుంది. స్వతహాగా ఆలోచించే శక్తిని, ప్రాతిభా నైపుణ్యాలను నిరోధిస్తుంది. అనుసరణ ఎన్నటికీ ఆమోదం పొందదు, ఒకవేళ ఆమోదం పొందినా అది తాత్కాలిక సంతృప్తి మాత్రమే. తద్వారా ఇతరుల విజయం, జీవనశైలి తో పోల్చుకొని క్రుంగుబాటు, నిరాశ నిస్పృహల తో సతమతం అవుతున్న వారు కూడా అధికం అవుతున్నారు.


📌 "లైక్స్ కోసం పోటీ"

సమాజంలో 'Like Anxiety' అనే పదం సోషల్ మీడియా పుణ్యంగా  ఇప్పుడే అందరికి సుపరిచితం అయింది. వ్యక్తిగత విలువలను కంటే, సోషల్ మీడియా స్పందనలపై ఆధారపడుతున్న యువత తలదించుకునే స్థితికి వచ్చారు. తమ ప్రతిభా పాటవాలు, ఆలోచనలు తగిన గుర్తింపుకు నోచుకోవడం లేదని మానసిక వేదనకు గురవుతున్నారు.



 Social Media వినియోగంలో కొన్ని వ్యక్తిగత నిబంధనలు  తప్పనిసరి 

✔️ సమయ పరిమితి విధించుకోండి

ప్రతిరోజూ 1 గంటకు మించి సోషల్ మీడియా వినియోగించవద్దని నిర్ణయించుకోండి.

✔️ పాజిటివ్ కంటెంట్‌ను ఎంచుకోండి

మీకు విజ్ఞానం, స్ఫూర్తి కలిగించే వీడియోలు, పోస్టులు మాత్రమే చూడండి.

✔️ ప్రైవసీ ప్యారామీటర్లు సెట్ చేయండి

మీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు ఎవరికీ కనిపించకూడదనుకుంటే ప్రైవసీ సెట్టింగ్స్ సరిగ్గా పెట్టుకోండి.

✔️ అవగాహన కలిగించండి – పిల్లలపై స్పెషల్ ఫోకస్

పిల్లలకు సోషల్ మీడియా ప్రమాదాల గురించి చెప్పడం, అవసరం అనుకున్నప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పడం అవసరం. పెద్దల పర్యవేక్షణ లేకుండా సోషల్ మీడియా వియోగాన్ని పూర్తిగా కట్టడి చేయాలి.


📝 సోషల్ మీడియా ( Social Media) వినియోగంలో విచక్షణ ఎంతో  అవసరం

సోషల్ మీడియా ఒక శక్తివంతమైన సాధనం. దీన్ని మంచి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే విజయం మనదే. కేవలం వినోదం కోసమో, కాలక్షేపం కోసమో అలవాటు చేసుకుంటే మాత్రం అనుకోని ఆపదలకు ఆహ్వానం పలికినట్టే. సోషల్ మీడియా అతి వినియోగం శారీరక, మానసిక రుగ్మతలను కలిగించడంతో పాటుగా సామాజిక హోదాను కూడా దిగజార్చే ప్రమాదం ఉంటుంది. సోషల్ మీడియా దుష్ప్రభావాలు వైవాహిక  సంబంధాలను సైతం విచ్చిన్నం చేస్తూ..కుటుంబాల పరువు మర్యాదలను రచ్చకు ఈడుస్తున్న ఘటనలు కోకొల్లలు. సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలను నిరంతరం మననం చేసుకుంటూ..పరిమితిలో,  అవసరార్ధం వినియోగిస్తూ.. జీవితాలను, సమాజాన్ని అభివృద్ధి పథంలో పయనించే ప్రయోజనంలో భాగస్వామిని చేద్దాం. 

సంక్షిప్తంగా చెప్పాలంటే – “Social Media is a good servant but a bad master.”



  • సోషల్ మీడియా మరియు మానసిక ఆరోగ్యం 

  • Influencer Marketing ప్రభావం

  • Cyber Crime & Digital Safety

  • యువతలో సోషల్ మీడియా అడిక్షన్

  • సోషల్ మీడియా వలన పరివర్తన చెందిన జీవనశైలి

 

2, ఏప్రిల్ 2025, బుధవారం

High Rise of Divorce Rate : దేశంలో విస్తృతం అవుతున్న విడాకుల సంస్కృతి

                                                             
High Rise of Divorce Rate

NRI Couple Divorce Issue: ఇటీవల  ఒక ఎన్ఆర్ఐ (NRI) దంపతుల విడాకుల కేసు సోషల్ మీడియాలో వైరల్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సనాతన సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలతో ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పొందుతూ అనాదిగా విశిష్టతను చాటుతుంది మన భారత దేశం. అత్యున్నత వివాహ, కుటుంబ వ్యవస్థల కొనసాగింపు పరంపరతో జగతికే ఆదర్శంగా నిలుస్తుంది. 


అత్యధిక జనాభాతో ప్రపంచ దేశాలలో ముందు వరసలో ఉన్నప్పటికీ.. అత్యల్ప విడాకుల రేటుతో ఆదర్శ పయనంలో ఉన్నాము. కానీ గత కొద్ది కాలంగా వేగంగా పెతుగుతున్న దాంపత్య కలహాలు, విడాకుల ఘటనలు ఆందోళన కలిగించే అంశాలే. విడాకులు అన్నవి వ్యక్తుల స్వేచ్చ, వ్యక్తిగత సంబంధిత వ్యవహారం అయినప్పటికీ.. వాటి పర్యవసానాలు కుటుంబ సంబంధ బాంధవ్యాలు, సమాజ గమనానికి ప్రతికూల సంకేతాలు అందించే ప్రమాదం ఉంది. భారతదేశంలో విడాకుల రేటు పెరగడానికి అనేక కారకాలు ఉన్నాయి. ఈ వ్యాసంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.


భారతదేశంలో విడాకుల పెరుగుదలకి ప్రధాన కారణాలు

1. మారుతున్న సామాజిక విలువలు

సాంప్రదాయంగా భారతీయ సమాజంలో పెళ్లి ఒక జీవితకాల బంధంగా పరిగణించబడేది. అయితే, ఆధునిక సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛ, సంతృప్తి వంటి అంశాలు పెళ్లి జీవితంలో ప్రధానంగా మారుతున్నాయి. దంపతులు వ్యక్తిగత ఆనందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుండటంతో, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే, విడాకుల బాట పట్టడం సహజంగా మారింది.

2. ఆర్థిక స్వాతంత్ర్యం

మహిళలు విద్య, ఉద్యోగాల్లో పురోగతి సాధించి, ఆర్థికంగా స్వతంత్రులవుతున్నారు. ఈ స్వాతంత్ర్యం వారికి సంబంధంలో సమస్యలు ఉంటే బయటపడే అవకాశాన్ని కల్పిస్తోంది. ముందుగా, ఆర్థిక పరమైన భద్రత లేకపోవడం వల్ల మహిళలు పెళ్లిలోనే ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, స్వంతంగా జీవించగల సామర్థ్యం పెరగడం వల్ల విడాకులు తీసుకోవడం పెరుగుతోంది.

3. లైంగిక సంబంధాల లోపం

పెళ్లిలో భౌతిక మరియు భావోద్వేగ సంబంధాలు కీలకం. దంపతుల మధ్య ఆకర్షణ తగ్గిపోతే లేదా వారి భౌతిక అవసరాలు తీర్చుకోలేకపోతే, అది దూరం పెరిగేందుకు దారితీస్తుంది. ఈ సమస్య విడాకులకు కారణంగా మారుతోంది.

4. నగరీకరణ మరియు ఆధునిక జీవనశైలి

పట్టణీకరణ వల్ల కుటుంబ వ్యవస్థ మారిపోతోంది. పూర్వం సంయుక్త కుటుంబ వ్యవస్థలో, పెద్దలు జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించేవారు. అయితే, నగరాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఒంటరితనంతో బాధపడే దంపతులు ఎక్కువయ్యారు. దీని వల్ల చిన్న చిన్న వివాదాలు విడాకులకు దారి తీస్తున్నాయి.

5. నమ్మకద్రోహం మరియు అవిశ్వాసం

భారతదేశంలో అవిశ్వాసం పెరుగుతుండడం, దంపతుల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. కొత్త సంబంధాలు, అక్రమ సంబంధాలు పెరగడంతో, విడాకుల సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ వాడకం పెరగడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

6. కుటుంబ సభ్యుల ఒత్తిడి

కొన్నిసార్లు, కుటుంబ సభ్యులు పెళ్లి జీవితంలో అధిక జోక్యం చేసుకోవడం వల్ల కూడా దంపతుల మధ్య విభేదాలు వస్తాయి. ముఖ్యంగా, కొత్త పెళ్లైన మహిళలకు అత్తింటి ఒత్తిడి ఎక్కువగా ఉంటే, వారు విడాకుల కోసం ఆలోచించే పరిస్థితి వస్తుంది.

7. పెళ్లిలో అసంతృప్తి

కొందరు భర్తలు లేదా భార్యలు తమ జీవిత భాగస్వామితో తాము ఊహించిన అనుభవం పొందలేకపోతే, పెళ్లిని కొనసాగించాలనే భావన తగ్గిపోతుంది. ఇది విడాకులకు దారి తీసే ప్రధాన కారణాల్లో ఒకటి.

8. చిన్న ( Micro Families ) కుటుంబాలు 

ఒకప్పుడు సమిష్టి కుటుంబ వ్యవస్థ విరాజిల్లిన కాలంలో విడాకులకు ఆస్కారం ఉండేది కాదు. కుటుంబంలోని పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కారణంగా దంపతులు తమ వ్యక్తిగత అహం తగ్గించుకొని కొన్ని కట్టుబాట్లు, ఆనవాయితీలను పాటించేవారు. ఒకవేళ వారి మధ్య విభేదాలు, మనస్పర్థలు చొరబడినప్పటికీ..పెద్దలు సకాలంలో గుర్తించి తగు నివారణ చర్యలు, దిద్దుబాటుతో వివాహ బంధం బీటలు వారనిచ్చేవారు కాదు. నేటి భార్య, భర్తలు వారి పిల్లలు మాత్రమే ఉన్న చిన్న కుటుంబాలలో చిన్న చిన్న సమస్యలు కూడా తగిన అనుభవంతో పరిష్కరించ గలిగే  పెద్దలు లేకపోవడంతో దాంపత్య విచ్చిన్నానికి దారితీస్తున్నాయి.


విడాకుల రేటును తగ్గించడానికి సూచనలు

  1. సమస్యలను ఓపికగా పరిష్కరించుకోవాలి: అన్ని సంబంధాల్లో సమస్యలు సహజం. అవి వచ్చినప్పుడు సంయమనం పాటించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం.

  2. సమయాన్ని కలిసి గడపాలి: ఉద్యోగ, ఇతర ఒత్తిడుల వల్ల దంపతులు ఒకరినొకరు పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. వారానికి కనీసం ఒక రోజు కలిసి గడపడం మంచిది.

  3. సంఘర్షణలు పెరిగినప్పుడు మూడో వ్యక్తిని సంప్రదించాలి: కుటుంబ పెద్దలు, కౌన్సిలింగ్ ఎక్స్‌పర్ట్స్ మద్దతు తీసుకోవడం ద్వారా సమస్యలు తగ్గించుకోవచ్చు.

  4. పెళ్లికి ముందు సరైన అవగాహన పెంచుకోవాలి: పెళ్లి అనేది జీవితాంతం కొనసాగాల్సిన బంధం. కాబట్టి, పెళ్లికి ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం.

ముగింపు

భారతదేశంలో విడాకుల రేటు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. సమాజంలో మారుతున్న జీవనశైలి, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత అభిప్రాయాలు పెరిగిపోవడం ఇవన్నీ ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. కుటుంబ బంధాలను మెరుగుపరచడం ద్వారా, సరైన అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు.  ఒకరినొకరు అర్థం చేసుకోవడం, నమ్మకాన్ని పెంచుకోవడం ద్వారా సంపూర్ణమైన పెళ్లిజీవితాన్ని గడపడం చాలా ముఖ్యం.