31, అక్టోబర్ 2024, గురువారం

పిల్లలలో విపరీత ధోరణులకు బీజం వేస్తున్న మొబైల్ ఫోన్ అతి వాడకం.. #అప్రమత్తం : Impact of Mobile phones use on children

పిల్లలలో విపరీత ధోరణులకు బీజం వేస్తున్న మొబైల్ ఫోన్ అతి వాడకం.. #అప్రమత్తం : Impact of Mobile phones use on children
                              మారం చేయకుండా తింటారని, బుద్దిగా ఒక చోట కూర్చుంటారని, తమ దైనందిన కార్యక్రమాలకు ఆటంకపరచరని తదితర కారణాలతో పిల్లలకు మొబైల్ ఫోన్స్ అందించడం అన్నది ప్రతి ఇంట్లోను సర్వ సాధారణ విషయం అయిపోయింది. ఈ అలవాటును మాన్పించకుంటే..అది పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పిల్లల వైద్యులు, మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణా జ్ఞానం తెలియని వయసు కావడంతో వారు అవాంచిత సమాచారాన్ని గ్రహించే ప్రమాదం ఉంది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న అనేక నేరాలు, ఘోరాలలో పెరుగుతున్న మైనర్ ల పాత్రకు ఇదీ ఒక ప్రధాన కారణంగా ఆయా దర్యాప్తు, విచారణ సమయాలలో వెల్లడవుతుంది. పిల్లలు కుదురుగా ఉంటున్నారన్న ఒక్క కారణంగా ఈ విపరీతాన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు రేపటి వారి పిల్లల భవిష్యత్ ను చీకటి మయం చేస్తున్నామన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. 

                                      ఇటీవల జరిగిన కొన్ని భయంకర నేరాలలో కరడుగట్టిన పాత నేరస్తుల పాత్ర ఉంటుందని పోలీసు అధికారుల అంచనాలను తల క్రిందులు చేస్తూ మైనర్ బాలల పాత్ర నిర్ధారణ అయి విస్తుగొలిపిన కేసులు ఎన్నో..ఎన్నెన్నో..ఇప్పటికైనా ఈ పిల్లల మొబైల్ అతి వినియోగం జాడ్యం పై తగిన పర్యవేక్షణ, నివారణ చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ దుష్పరిణామాలు స్వయంకృతాపరాధమే అవుతాయి. 

ఈ అలవాటు మాన్పించడానికి మానసిక నిపుణులు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు: 

1.స్క్రీన్ టైమ్ పరిమితులు ఏర్పరచండి : ప్రతి రోజూ మొబైల్ వినియోగానికి సమయం పరిమితం చేయండి, ముఖ్యంగా వినోదం కోసం. ఇది ఎక్కువగా ఉపయోగించకుండా ఉండేందుకు సమయ నియంత్రణ సెట్టింగ్స్ లేదా పెరెంటల్ కంట్రోల్ యాప్‌లను ఉపయోగించండి. 

2.  ఇతర అలవాట్లు, కార్యకలాపాలకు ప్రోత్సహించండి : క్రీడలు, పుస్తకాలు చదవడం లేదా హస్తకళల వంటి ఆఫ్‌లైన్ కార్యకలాపాలకు ప్రోత్సహించండి. పిల్లలు ఆసక్తికరమైన ఇతర విషయాలలో పాల్గొంటే, వారు మొబైల్‌కు ఎక్కువగా ఆకర్షించబడరు. 

3.  "డివైస్-ఫ్రీ" జోన్స్‌ను సృష్టించండి : కుటుంబ భోజనాలు లేదా నిద్రకు ముందు వంటి సమయంలో మొబైల్‌ లేనటువంటి ప్రత్యేక స్థలాలను లేదా సమయాలను ఏర్పాటు చేయండి. ఇది మొబైల్ వినియోగానికి ప్రత్యామ్నాయాన్ని ఇస్తుంది. 

4. మీరు రోల్ మోడల్ అవ్వాలి : మీరు కూడా మొబైల్ వినియోగాన్ని పరిమితంగా ఉంచుతూ పిల్లలకు తగిన ఆదర్శంగా ఉండండి. పిల్లలు చాలా సందర్భాలలో తల్లిదండ్రుల అలవాట్లను అనుకరిస్తారు. 

5.  విద్యా సామగ్రిని పరిమితంగా ఉపయోగించండి : విద్యా సంబంధిత యాప్‌లు, కంటెంట్‌ను అపరిమితంగా కాకుండా, తగ్గించి ఉపయోగించండి. ఇది వారు విద్యా ఉద్దేశ్యంతో మొబైల్ ఉపయోగాన్ని పరిమితంగా అనుభవించడానికి తోడ్పడుతుంది. 

6.  సామాజిక పరస్పర చర్యలకు ప్రోత్సహించండి : స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలుసుకునే అవకాశాలు కల్పించండి. ముఖాముఖి పరస్పర చర్యలు పిల్లలకు అవసరమైన సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో మరియు ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఉండకుండా చేయడంలో సహాయపడతాయి. 

 ఈ మార్గదర్శకాలు మొబైల్ వినియోగాన్ని ఆరోగ్యంగా, సమతుల్యతగా ఉంచడంలో పిల్లల పెంపొందనకు తోడ్పడతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి