12, డిసెంబర్ 2024, గురువారం

విద్వేష దారిలో విద్యార్థులు : గతి తప్పిన గురుశిష్య బంధం : Bad behaviour of students in schools


Bad behaviour of students in schools



                                  మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ను తుపాకీతో కాల్చి చంపిన 12 వ తరగతి విద్యార్థి..ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటి కొత్తపల్లి ఉర్దూ పాఠశాలలో సైన్స్ టీచర్ అహ్మద్ పై దాడి చేసి, ఆయన మరణానికి కారకులైన 9 వ తరగతి విద్యార్థులు. ఈ రెండు అమానుష ఘటనలు ఇటీవల జరిగినవే. ఈ ఇద్దరు ఉపాధ్యాయులు తమ నిండు జీవితాన్ని కోల్పోయే విధంగా చేసిన తప్పు ఏదైనా ఉందీ అంటే అది..తమ బిడ్డల్లా భావించే విద్యార్థులు  క్రమశిక్షణ మీరి ప్రవర్తిస్తుంటే వారిని  సక్రమ మార్గంలో పెట్టడానికి మందలించడమే. "గురుబ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్ష్యాత  పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవేనమః " అని గురువుని దేవునిలా పూజించాలని ప్రపంచానికే చాటి చెప్పిన పుణ్యభూమి లో నేడు జరుగుతున్న ఘోరాలు ఎంత మాత్రం  క్షమార్హం కాదు. 


                                      తనకు స్వయంగా విలువిద్య నేర్పకున్నా..పరోక్ష స్ఫూర్తిగా నిలిచిన కారణానికి గురుదక్షిణగా కుడి చేతి బొటన వేలుని కోరిన ద్రోణాచార్యునికి భక్తిపూర్వకంగా తన గురుదక్షిణ చెల్లించిన ఏకలవ్యుడు వంటి ఆదర్శ శిష్యుడు నడయాడిన నేలపైనా ఈ దారుణాలు..? అన్నెం పున్నెం ఎరుగని పసి మనసులలో  ఇంతలా కసి, క్రోధాలు పెచ్చరిల్లడానికి మూలం ఏమిటి ? ఏ మనిషి ప్రవర్తన అయినా తాను పుట్టి, పెరిగిన పరిసరాల ప్రభావం ఫలితం అధికంగా ఉంటుందని విశ్వసనీయత కలిగిన అధ్యయనాలు, మానసిక విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ముందుగా కుటుంబం, నివాస ప్రాంత పరిసరాలు, తదుపరి విద్యా, విజ్ఞానాన్ని ప్రసాదించే పాఠశాలలు, తుదిగా జీవిస్తున్న సమాజ వాతావరణం మనిషి ప్రవర్తనపై తగు ప్రభావాన్ని చూపుతాయి. 


                                   కుటుంబం నుండే తొలిగా నైతిక విలువలు, ప్రవర్తన పిల్లలకు అలవాటు కావాలి. తరువాత వారి శారీరక, మానసిక ఎదుగుదలలో కీలక పాత్ర వహించే పాఠశాలలు వారిని బాధ్యతాయుతమైన, ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతాయి. ఈ పరిణామ క్రమంలో ఉపాధ్యాయులు ఎంతో క్రియాశీల బాధ్యతలు  నిర్వర్తిస్తారు. ప్రాచీన కాలంలోనే గురుకులాల వంటి గొప్ప విద్యా వ్యవస్థను ప్రపంచానికి అందించిన విశిష్ట ఘనత మనది. సమాజానికి దూరంగా అరణ్యాలలోని గురుకులాలలో గురువు, గురువు కుటుంబానికి భక్తీ, శ్రద్దలతో  సుసృశలు చేస్తూ ..గురువు కరుణా కటాక్షాలతో అభ్యాసన సాగించి, సకల విద్యాపారంగతులుగా తయారయ్యేవారు. అంతటి విశిష్టత కలిగిన గురుశిష్య బంధానికి ఇంతగా బీటలు పడడానికి కారణాలను విశ్లేషించుకొని, సరిదిద్దుకోకుంటే భవిష్యత్ మరింత ప్రమాదభరితం కాక తప్పదు. 


                                     పురాతన కాలం నాటిలా కాకున్నా గత మూడు, నాలుగు దశాబ్దాల క్రితం కూడా గురువు స్థానానికి తగిన గౌరవం, మర్యాద ఉండేది. పాఠశాలలోనే కాదు బయట ఎక్కడ మాస్టారు కనబడినా విద్యార్థులు అదే  భయం, భక్తీ ప్రదర్శించేవారు. విద్యార్ధులతోపాటు వారి కుటుంబాలు సైతం అదే ఆదరణ చూపించేవారు. కొందరు చండశాసన పండిత గురువర్యులు అల్లరి చేస్తున్న తరగతి గదికి వచ్చి కొంచెం హెచ్చు స్వరంతో అరిస్తే చాలు తరగతి గది మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోవడంతోపాటు కొందరు బడుద్దాయిల నిక్కర్లు తడిసిపోయిన ఘటనలు కోకొల్లలు ఉండేవి.  మరి ఇప్పుడో..ఒకవేళ విద్యార్థుల ఆగడాలు శృతి మించాయని బెత్తం ఝలిపిస్తే.. "చదువు రాకుంటే మానే, మా పిల్లోడిని మేమే పల్లెత్తు మాట అనం. మందలించడానికి మీరు ఎవరు ? " అని తల్లిదండ్రులు దండెత్తి రావడం సర్వ సాధారణం. 


                              గురువులను గౌరవించడం లేకపోగా వారిని ఆట పట్టించడం, గేలి చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఒకప్పుడు యూనివర్సిటీలు, కాలేజీలలో కనిపించే ఈ జాడ్యం ఇప్పుడు హైస్కుల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ కు సైతం పాకడం ఎంతో శోచనీయం. విద్యార్థులను మాత్రం అనుకునేది ఏముంది? వారిని విపరీతంగా ప్రభావితం చేసే సినిమాలలో సైతం  వారి అభిమాన హీరోలే అటువంటి సన్నివేశాలలో నటిస్తుంటే. సినిమాలలో చూపించే మంచిని, నైతిక విలువలను ఎంత మంది పాటిస్తున్నారు మా సినిమాల చెడు వల్ల దారి తప్పడానికి అని సినీ జనాలు నిలదీస్తున్నారు. లోకం తీరే అలాంటిది. మనల్ని  చెడు ఆకర్షించినంతగా మంచి ఆకట్టుకోదుగా..? 



  Also read:  పిల్లలలో విపరీత ధోరణులకు బీజం వేస్తున్న మొబైల్ ఫోన్ అతి వాడకం.. #అప్రమత్తం


                                  ఒకటి మాత్రం నిజం. ఒకప్పుడు విద్యార్థులు, పిల్లలకు ఈ ఆధునిక సాంకేతిక మాయాజాలం అనే వలలో చిక్కుకునే అవకాశం లేకపోవడంతో వారి విద్యాభ్యాసం ఒక పద్దతిలోనే సాగింది. ఇప్పటి విద్యార్ధి లోకానికి దారి తప్పించే ప్రలోభాలన్నీ అరచేతిలోనే ఇమిడి ఉంటున్నాయి. అందివస్తున్న ఆధునిక పరిజ్ఞానం వినియోగిచుకొని భవిష్యత్ ను ఉజ్వలం చేసుకుంటున్న విద్యార్తులు కూడా ఉన్నారు. కానీ వారి శాతం తక్కువ. సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందాలని వెర్రి మొర్రి వేషాలు వేస్తూ, చెడు అలవాట్లకు బానిసలవుతూ చదువుని నిర్లక్ష్యం చేస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు. విద్యార్థులపై అఘాయిత్యాలు, అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్న ఉపాధ్యాయుల ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. అంతిమంగా గురుశిష్య పూజ్య బంధం బీటలు వారుతుంది. 


                             సాధారణ బదిలీలపై టీచర్లు ఒక పాఠశాలను వీడి మరొక పాఠశాలకు వెళుతున్నవీడ్కోలు  సందర్భంలో విద్యార్థులు విలపిస్తున్న అపురూప దృశ్యాలు చూస్తుంటే ఎంత హృద్యంగా అనిపిస్తుంది. ఇది కదా గురుశిష్య పవిత్ర బంధంలో ఇమిడి ఉన్న అనుబంధం. ఇకనైనా విద్యార్థి లోకం తమ మానసిక, శారీరక వికాసానికి అవరోధంగా ఉన్న జాడ్యంలను గుర్తించి, అధిగమించి, ఉజ్వల   భవిష్యత్ వైపు పయనించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి