ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడం అన్నది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒకచోట ఈ దుర్ఘటనలకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉంటున్నాయి. ఈ విషాదకరమైన సంఘటనలు నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడిని, ఆందోళనను తెలియజేస్తున్నాయి.
ఆడుతూ పాడుతూ, నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొట్టాల్సిన విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడి ఎంతో ఉజ్వలంగా సాగాల్సిన జీవితాలకు అర్ధాంతర, అర్ధం లేని ముగింపులను పలకడం సభ్య సమాజానికి కలవరం కలిగించే అంశం. ఒక విధంగా ఇవి సమాజం చేస్తున్న హత్యలు.
బాధతో, వేదనతో తల్లడిల్లుతున్న ఆ పసి హృదయాలు తమ గోడును ఈ లోకంలో పట్టించుకునే వారే కరువయ్యారు అని నిరాశ, నిస్పృహలకు గురయ్యి ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నెమ్మది నెమ్మదిగా విద్యార్థి లోకాన్ని కబళిస్తున్న ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, మన విద్యార్థులకు అండగా నిలబడాల్సిన సమయం ఇది.
మన ఉరుకుల పరుగుల జీవితంలో సమాజ మనుగడ, గమనంపై తీవ్ర ప్రభావం కనబరచనున్నఇటువంటి సాంఘిక సమస్య గురించి కనీసం ఆలోచన చేసే సమయం కూడా లేకపోవడం చాల శోచనీయం. ఇది ఎక్కడో జరుగుతున్న సమస్యగా తలచి తేలికగా తీసుకుంటే.. అది రేపు మన గుమ్మంలో నిలిచి తలుపు తట్టే అవకాశం ఎంతో దూరంలో ఉండదు.
Also Read : విద్వేష దారిలో విద్యార్థులు : గతి తప్పిన గురుశిష్య బంధం : Bad behaviour of students in schools
విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు :
విద్యార్థుల ఆత్మహత్యలకు అనేక కారణాలు దోహదం చేస్తాయి:
చదువుల ఒత్తిడి : తీవ్రమైన పోటీ, అధిక మార్కులు సాధించాలనే ఒత్తిడి విద్యార్థులలో ఆందోళన, నిరాశకు దారితీస్తుంది.
కుటుంబ అంచనాలు : కుటుంబ సభ్యుల అధిక అంచనాలు కొన్నిసార్లు విద్యార్థులకు భారంగా మారుతాయి. తాము తమ కుటుంబ ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాణించలేక పోతున్నామనే బాధ వారిని వేధిస్తుంది.
సాంఘిక సమస్యలు : ర్యాగింగ్, స్నేహితుల ఒత్తిడి, ఇతరత్రా సంబంధాల సమస్యలు విద్యార్తుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
తగిన సహాయం లేకపోవడం : తమ సమస్యల గురించి ఎవరితో చెప్పుకోవాలో తెలియక, అవసరమైన సమయంలో తగిన సహాయం పొందలేక, తాము ఈ సమాజంలో ఒంటరి అయిపోయామని భావించడం.
Also Read : పిల్లలలో విపరీత ధోరణులకు బీజం వేస్తున్న మొబైల్ ఫోన్ అతి వాడకం.. #అప్రమత్తం : Impact of Mobile phones use on children
విద్యార్థుల ఆత్మహత్యలను అదుపు చేయడం :
విద్యార్థుల ఆత్మహత్యలను అదుపు చేయడానికి మనం అనేక చర్యలు తీసుకోవాలి:
విద్యాలయాలు జోక్యం : పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్య నిపుణులను నియమించి, తీవ్ర ఒత్తిడి, నిరాశ లో ఉన్న విద్యార్థులను గుర్తించి సహాయం అందించాలి.
సలహా మరియు మద్దతు : విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవడానికి సలహా, సేవలు అన్నవి సులభంగా అందుబాటులో ఉండాలి.
అవగాహన కార్యక్రమాలు : విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం, సహాయం కోరడాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు తరచుగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.
విద్యా ఒత్తిడిని తగ్గించడం : విద్యా సంస్థలు కేవలం మార్కులపైనే కాకుండా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. శారీరక, మానసిక వికాసానికి తోడ్పడే ఆటలు, కళలు ఇతర సృజనాత్మక రంగాలపై ఆసక్తిని పెంపొందించాలి.
మద్దతు వాతావరణాన్ని సృష్టించడం : పాఠశాలలు, కుటుంబాలు విద్యార్థులకు స్వేచ్ఛగా మాట్లాడేందుకు, మద్దతు పొందేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి. విద్యార్తులకు ఇంట్లోను, విద్యాలయాలలోనూ స్నేహపూరిత వాతావరణం కల్పించాలి.
విద్యార్థుల ఆత్మహత్యలు అన్నది తీవ్రమైన సమస్య. కారణాలను అర్థం చేసుకొని, నివారణ చర్యలు చేపట్టడం ద్వారానే మనం ఈ విషాదాలను నివారించగలము. మన విద్యార్థులకు సురక్షితమైన, మద్దతునిచ్చే వాతావరణాన్ని నిర్మించడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం. విద్యార్థుల జీవితాలలో ఒత్తిడి ఉండటం సహజమే. కానీ, దీనిని అధిగమించడానికి తగిన మానసిక బలాన్ని కల్పించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసికట్టుగా విద్యార్థులను ప్రోత్సహించి, వారి భవిష్యత్తును మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలి. జీవితానికి విలువను నేర్పిస్తూ, వారి లక్ష్యాలను అర్థవంతంగా మార్చే మార్గాలను చూపుదాం.
💡 "జీవితం విలువైనది – ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి