18, మే 2025, ఆదివారం

youtuber jyoti malhotra : పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు లీక్ చేసిన మహిళా యూట్యూబర్‌: “ట్రావెల్ విత్ జో” ( Travel With Jo ) వెనుక దాగిన దేశద్రోహం కథ!

                                                                            

                                                                                 

youtuber jyoti malhotra  ( travel with jo  )

స్వార్థం...నేటి ఆధునిక సమాజంలో జరుగుతున్న ఎన్నో ఘోరాలకు ప్రధాన కారణం. నేను మాత్రం..నేను మాత్రమే బాగుంటే చాలు అన్న జుగుప్సాకర నైజం. దానికోసం ఎంత దిగువ స్థాయికి అయినా సిగ్గు ఎగ్గు లేకుండా దిగజారి పోయే మనిషితత్వం. అందుకు స్వంత కుటుంబాన్ని సైతం బలి చేయడానికి వెనుకాడని రాక్షసత్వం. ఇక జన్మభూమిని వంచించడానికి ఎందుకు వెనుకంజ వేస్తారు? సోషల్ మీడియా లో పాపులారిటీ, డబ్బు, హోదాతో కూడా  తృప్తి పడని ఒక హర్యానా మహిళా యుట్యుబార్ తన స్వార్ధం, అత్యాశకు దేశ భద్రతను సైతం అంతర్జాతీయ అంగడిలో అమ్మకానికి పెట్టిన దారుణం. ఇదేనా మన పుడమి తల్లి కి తీర్చుకునే ఋణం?


లక్షల ఫాలోవర్లతో దేశభక్తి ముసుగులో మోసం

youtuber jyoti malhotra : హరియాణాలోని హిస్సార్‌కు చెందిన జ్యోతి మల్హోత్రా, "ట్రావెల్ విత్ జో" ( Travel With Jo ) అనే పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతూ, దేశభక్తిని చూపిస్తూ వందల కొద్దీ వీడియోలు అప్‌లోడ్ చేసిన యువతి. కానీ నిజానికి ఆమె దేశాన్ని ప్రేమించకపోగా, అత్యంత హేయమైన దేశద్రోహ నేరానికి పాల్పడిందన్న సంగతి పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దేశభక్తి పాటలు, జాతీయ జెండా ఎగరవేయడం, గన్ సెల్యూట్‌లు చూపిస్తూ షూట్ చేసిన వీడియోలు వెనుక అసలైన ఉద్దేశం పాకిస్తాన్‌ గూఢచారులకు సహాయం చేయడమే.


సైనిక బేస్‌లు, DRDO స్థావరాలు టార్గెట్

పంజాబ్, హరియాణా, రాజస్థాన్, లద్దాఖ్ ప్రాంతాల్లోని సున్నితమైన సైనిక, వైమానిక స్థావరాల వద్ద హై రెజల్యూషన్ వీడియోలు తీసి, GPS ట్యాగ్‌లు జత చేసి, డ్రోన్‌లను వాడి ప్రతి మూలకూ ఫుటేజ్ సమకూర్చిన జ్యోతి, వాటిని వాట్సాప్, టెలిగ్రామ్‌ ద్వారా పాక్ ఏజెంట్లకు చేరవేసింది. సైనిక వాహనాలు, ఎలక్ట్రానిక్ సెన్సార్లు వంటి రహస్య సమాచారం కూడా ఆమె ద్వారా బయటపడ్డాయని సైబర్ సెల్ అధికారులు పేర్కొన్నారు.


‘ఆపరేషన్ గోస్ట్ సిమ్‌’ – దేశద్రోహిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొనే ప్రణాళిక 

‘ఆపరేషన్ గోస్ట్ సిమ్‌’ పేరిట కేంద్ర ప్రభుత్వ ఐబీ, హరియాణా పోలీసుల సంయుక్త విచారణలో ఈ నేటి తరం పాకిస్తాన్  గూఢచార వ్యవస్థ వెలుగులోకి వచ్చింది. మహిళలను టార్గెట్ చేస్తూ, పాక్ ఏజెంట్లు ప్రేమ పేరుతో, పెళ్లి హామీలతో, డబ్బుతో వల వేస్తున్నారు. జ్యోతితో పాటు మరో ఐదుగురిని ఈ కేసులో అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు ఉండగా, మిగిలిన వారు యువకులు.


డానిష్ – పాక్‌ హైకమిషన్‌లో చురుకైన గూఢచారి

జ్యోతికి మొదట పరిచయమైన వ్యక్తి డానిష్ అలియాస్ అహ్సాన్ ఉర్ రహీమ్. అతడు ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో పని చేసేవాడు. అతడు మాత్రమే కాక, జ్యోతి తదితరులకు పాక్ గూఢచారులను పరిచయం చేయడం, వాట్సాప్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌ వంటి యాప్‌ల ద్వారా దేశ రహస్యాలు పంపేలా ప్రోత్సహించడంలో కీలకంగా వ్యవహరించాడు. కేంద్రం అతడిని ఈ నెల 13న “అవాంఛనీయ వ్యక్తి”గా ప్రకటించి, భారత్ నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించింది.


ఇఫ్తార్ విందులో  విరిసిన కుట్ర 

జ్యోతి గత సంవత్సరం ఇఫ్తార్ విందులో పాక్ హైకమిషన్‌ కార్యాలయానికి వెళ్లిన వీడియోను పోస్ట్ చేసింది. అక్కడ ఆమె డానిష్‌తో అత్యంత సన్నిహితంగా మెలగిన, మాట్లాడిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఇది కేవలం సామాన్య పరిచయం కాదు. వీరి మధ్య ఉన్న సంబంధం మరింత లోతుగా ఉందని అధికారులు భావిస్తున్నారు.


ఇతర నిందితుల పాత్ర

ఈ దేశద్రోహం వ్యవహారంలో జ్యోతితో పాటు మరికొంతమంది యువతీ యువకులు కూడా భాగస్వాములయ్యారు:

  • గుజాల (32): పంజాబ్‌లోని మలేర్‌కోట్లకు చెందిన వితంతువు. వీసా కోసం వెళ్లిన సందర్భంగా డానిష్ పరిచయం అయ్యాడు. అతడు ఆమెను పెళ్లి పేరుతో మోసం చేశాడు.

  • బాను నస్రీన్: మరో వితంతువు, డానిష్‌ ద్వారా వెంటనే పాక్ వీసా పొందింది.

  • యమీన్ మహ్మద్: డానిష్‌తో కలిసి ఆర్థిక వ్యవహారాలు నిర్వహించిన వ్యక్తి.

  • దేవిందర్ సింగ్ ధిల్లాన్: పటియాలా ఖల్సా కళాశాల విద్యార్థి. పాక్ ఐఎస్‌ఐకి కీలక సమాచారం అందించాడని ఒప్పుకున్నాడు.

  • అర్మాన్: నుహ్‌కు చెందిన యువకుడు. సిమ్ కార్డులు, డబ్బు పంపిణీ బాధ్యతల్లో కీలక పాత్ర వహించాడు.


డిఫెన్స్ ఎక్స్‌పోలోనూ చొరబడిన ఘాతుక  నక్కలు 

పాక్ ఏజెంట్ల సూచనల మేరకు డిఫెన్స్ ఎక్స్‌పో 2025ను కూడా సందర్శించిన అర్మాన్, అక్కడి పరిసరాల డేటా సేకరించాడని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా, ప్రేమ, డబ్బు – అన్నింటినీ వినియోగించి పాక్ గూఢచార వ్యవస్థ భారత దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి  ప్రయత్నించిందని స్పష్టం అయ్యింది.


పోలీసులు హెచ్చరిక

ఈ ఘటనలను చూస్తే పాక్ గూఢచారులు మతపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆత్మస్థైర్యం లేని వారిని టార్గెట్ చేస్తూ, ప్రేమ, పెళ్లి, డబ్బు వంటి ఎముకలతో వల వేస్తున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది దేశ భద్రతకు ప్రమాదకర ముప్పు.


ఇది దేశాన్ని ప్రేమించే ప్రతి పౌరుడికీ హెచ్చరిక: దేశభక్తిని ముసుగుగా వేసుకుని తమను ఎవరు గుర్తించలేరని దేశద్రోహం  చేసే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. దేశ భద్రత విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి