21, నవంబర్ 2024, గురువారం

ఉత్తరాఖండ్ ఘోర కారు ప్రమాదం..తలెత్తుతున్న ప్రశ్నలెన్నో..! Uttarakhand car accident Dehradun car accident

                                        

Uttarakhand car accident Dehradun car accident



దేశంలో ప్రతిరోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలలో మరణిస్తున్న వారి సంఖ్య, క్షతగాత్రులు అవుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. మితి మీరిన వేగం అధిక ప్రమాదాలకు కారణంగా మారుతుంది. తాజాగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో చోటు చేసుకున్న కారు ప్రమాదానికి కూడా అతి వేగమే మృత్యు కుహరంగా మారింది. అందులోనూ ప్రయాణిస్తున్న వారు,   ప్రమాదానికి ముందు జరిగిన పార్టీలో మద్యం సేవించినట్టు సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోలో వెలుగు చూసింది. 

ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు హాస్పిటల్ లో విషమ పరిస్థితిలో పోరాడుతున్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు. అందరూ స్నేహితులే.   ఒక మిత్రుడు కొత్త కారు కొనడం..దాని నిమిత్తం ట్రీట్ ఇవ్వాల్సిందిగా మిగతా బృందం ఒత్తిడి చేయడంతో విందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఆ వినోద సంబరాలను ఆల్కహాల్ మరింత ఉత్తేజభరితం చేసినట్లు తరువాత ప్రచారంలోకి వచ్చిన వీడియోల ద్వారా తెలిసింది. ఆ పార్టీ అనంతరం అందరూ కొత్త కారులో డ్రైవ్ కి సిద్దమయ్యారు. అందరూ  ఉరికే జలపాతాలకు మల్లే నవ యవ్వనంలో పరవళ్ళు తొక్కుతున్నవారే. వారి టీనేజ్ జోరుకు పార్టీ కిక్ మరింత ఆజ్యాన్ని పోసింది. అర్థరాత్రి  ఆ హుషారులో తుఫాన్ వేగంతో నడుపుతున్న కారు అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న ట్రక్ ను బలంగా ఢీ కొట్టింది. ఆ గుద్దుడు ధాటికి కారు టాప్ ఎగిరిపడడమే కాకుండా కారులోని ఇద్దరి తలలు తెగి రోడ్డు పై పడ్డాయంటే ఆ ప్రమాదం ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ప్రమాద స్థలంలోనే దుర్మరణం చెందారు. ఒక యువకుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ కు తరలించబడ్డాడు. 

 యాక్సిడెంట్ జరిగిన కొద్దిసేపటికే తీయబడిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వైరల్ అయి గగుర్పాటు కలిగించాయి. పూర్తి చిద్రమై రోడ్డుపై చెల్లా చెదురుగా పడివున్న శరీర భాగాలు ఎవరెవరివో కూడా గుర్తించలేని విషాద పరిస్థితుల్లో వున్నాయి. ఈ ఘోర ప్రమాద ఘటన గురించిన సమాచారం తెలిసిన సామాన్య ప్రజలకే ఎంతో వేదన కలిగితే..బాధిత కుటుంబాల విషాదానికి హద్దు ఉంటుందా..? 

తీవ్ర సంచలనం, పెను విషాదం కలిగించిన ఈ ఘోరకలి ఘటన మన సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తుంది...ఈ నవ యవ్వన జీవితాల అర్థాయుస్సు ముగింపుకు కారణం ఏమిటని?...బాధ్యతారాహిత్యం..అవును ముఖ్య కారణం బాధ్యతారాహిత్యమే..ఈ ప్రమాద ఘటనలో బాధితులు అందరూ సంపన్న వర్గానికి చెందిన వారే..వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తమ పిల్లలకు కావాల్సిన స్వేచ్చను ఇస్తున్నామని, కోరినవి కాదనకుండా వారికి సొంతం చేస్తున్నామని మురిసిపోయారే తప్ప...అది తమ బిడ్డల జీవన, వ్యవహార శైలిని ప్రభావితం చేస్తుందని, విశృంఖలత్వానికి దారి తీస్తుందని గుర్తించలేక పోయారు. పిల్లల నడవడికపై కనీస అజమాయిషీ, పర్యవేక్షణ కొరవడి పూర్తి బాధ్యతారాహిత్యానికి పాల్పడి ఇప్పుడు జీవితాంత కడుపుకోత, క్షోభ మిగుల్చుకున్నారు. ఆ యువత కూడా చుట్టూ సమాజంలో ఎందరికో దక్కని అతి ప్రేమ, అతి సౌఖ్యం తమకు దక్కుతుందని గుర్తించి, గౌరవించకుండా..విలాసాలు, విచ్చలవిడి తనానికి ఆకర్షితులై అపాయాన్ని కోరి ఆహ్వానించుకున్నారు..ఇది ఆ యువత బాధ్యతారాహిత్యం..ఈ ఘోర విషాద ఘటన మనలో ఎందరికో హెచ్చరిక అవ్వాలి.. కనువిప్పు కావాలి..మంచి మార్పును తేవాలి..అప్రమత్తం కావాలి..!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి