3, నవంబర్ 2024, ఆదివారం

Natural decoction : కషాయంతో కడుపులో కల్మషాలు మాయం

Natural decoction : కషాయంతో కడుపులో కల్మషాలు మాయం
                                ఒకప్పుడు ఇంట్లో తినడం ఎక్కువ..బయట ఆహార పదార్థాలు తినడం బహు అరుదుగా ఉండేది. ఇప్పుడేమో బయట తినడం ఎక్కువైంది. అడుగడుగునా ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన రెస్టారెంట్లు, హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మొబైల్ క్యాంటిన్లు, మిర్చి బడ్డీలు, బేకరీలు ఇలా చాంతాడు అంత ఆహార కేంద్రాల చూపు తిప్పుకోకుండా ఆప్యాయంగా ఆహ్వానిస్తుంటే ఆగగలమా..? జంక్ ఫుడ్ తో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు, పౌష్టికాహార నిపుణులు నెత్తి, నోరు బాదుకుని చెప్తున్నా తలకు ఎక్కించుకుంటున్నామా..? బిరియానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పానీ పూరీ, చాట్, పునుగులు, మిరపకాయ బజ్జీలు, పిజ్జా, బర్గర్ లతో పాటు రోజు రోజుకీ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ఆధునిక చిరుతిళ్ళ వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నాము. వీటి వల్ల కలిగే మానసిక, శారీరక సమస్యలు పట్టించుకోకుండా తాత్కాలిక జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరుచుకుంటున్నాము.కడుపు నొప్పి, అజీర్తి, మలబద్దకం, గ్యాస్ ట్రబుల్ లాంటి ఉదర సంబంధిత వ్యాధులతోపాటు ఇతర ఎన్నో వ్యాధులకు ఈ జంక్ ఫుడ్ కారణం అవుతుంది. 

                                     మన పూర్వీకులు సహజ సిద్ద కాషాయాలు తయారు చేసుకుని తరచుగా సేవించడం ద్వారా ఉదర ప్రక్షాళన చేసుకొనేవారు. ఆయుర్వేద, సహజ వైద్య ఆరోగ్య విధానాలపై విశ్వాసం ఉన్నవారు ఇప్పటికీ వాటిని అనుసరిస్తూ ఉపశమనం పొందుతున్నారు. అప్పుడప్పుడైనా ఈ సహజ సిద్ద కషాయలు తాగడం ద్వారా జంక్ ఫుడ్ తినడం వలన కలిగే అనర్థాలను కొంతైనా నివారించవచ్చని సిద్ద ఆచార్యులు చెప్తున్నారు. కషాయం అనేది ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడే ఒక ఆవిరి పానీయం. ఇది తేనె, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క వంటి ఔషధ గుణాలు ఉన్న పదార్థాలతో తయారు చేస్తారు. కషాయంలో ఉండే పదార్థాలు శరీరానికి చాలా లాభాలను అందిస్తాయి. 

కషాయం తయారీకి కావలసిన పదార్థాలు: 1. నీరు - 2 గ్లాసులు 2. అల్లం - 1 చిన్న ముక్క, సన్నగా తరిగినది 3. దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క 4. తులసి ఆకులు - 5-6 ఆకులు 5. పుదీనా ఆకులు - 4-5 ఆకులు (ఆప్షనల్) 6. మిరియాలు - 5-6 గింజలు 7. జీలకర్ర - 1/2 టీ స్పూన్ 8. తేనె - 1 టీ స్పూన్ (తర్వాత చల్లారిన తర్వాత కలపాలి)

తయారీ విధానం: 1. మొదట ఒక గిన్నెలో 2 గ్లాసుల నీరు తీసుకుని మరిగించాలి. 2. నీరు మరిగిన తర్వాత అందులో అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు, పుదీనా ఆకులు (వుంటే), మిరియాలు, జీలకర్ర వేసి మళ్లీ కొంచెం మరిగించాలి. 3. ఇది సగం వరకు మరిగిన తర్వాత దించుకోవాలి. 4. చల్లారిన తర్వాత, కషాయంలో తేనె కలపాలి.

కషాయం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: 
1. జలుబు, దగ్గు నయం: ఈ కషాయం తాగడం వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయి. అల్లం, తులసి, మిరియాలు శ్వాస రోగాలను దూరం చేస్తాయి. 

2. జీర్ణశక్తి మెరుగుపడుతుంది: జీలకర్ర, అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. 

3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఈ కషాయం రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి రక్షణను అందిస్తుంది. 

4. శరీరం డిటాక్సిఫై చేస్తుంది: దాల్చిన చెక్క, పుదీనా వంటివి టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి. 

5. వేడిని  తగ్గిస్తుంది: అల్లం, మిరియాలు శరీరంలోని వేడిని  తగ్గిస్తాయి. శీతాకాలంలో, ఈ కషాయం తాగడం చాలా మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి