14, నవంబర్ 2024, గురువారం

సూట్ కేస్ లో శవం ..నగల కోసం వృద్దురాలిని హత్య చేసిన తండ్రి, కూతురు : Dead body in suite case

సూట్ కేస్ లో శవం Dead body in suitecase

ఏదో ముఖ పరిచయం ఉన్నవారు కదా ఇంటికి ఆహ్వానిస్తున్నారని నమ్మి వెళ్ళిన పాపానికి ఒక పెద్దావిడ తన జీవితాన్ని చేతులారా బలి చేసుకున్న విషాదం నెల్లూరులో చోటు చేసుకుంది. అంతకంతకు మంటగలిసిపోతున్న మానవత్వపు విలువలకు అద్దం పడుతుంది ఈ ఘోరకలి. నెల్లూరు కుక్కలగుంట రాజేంద్ర నగర్ కు చెందిన రమణి అనే 65 సంవత్సరాల వృద్దురాలు కూరగాయలు తెస్తానని బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఎంతకూ ఆమె ఆచూకీ లేకపోవడంతో తెలిసిన అన్ని చోట్ల కుటుంబసభ్యులు, బంధువులు వెతికి, ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంతలో చెన్నై రైల్వే పోలీసుల నుండి  సదరు మహిళ హత్య చేయబడిందని, ఆమె మృతదేహం ఇరువురు వ్యక్తులు ట్రాలీ సూట్ కేస్ లో తరలిస్తూ పట్టుబడ్డారు అన్న సమాచారం తెలియడంతో హతాశులైన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నై బయలుదేరి వెళ్లారు. ఒక మధ్య వయస్కుడు, ఒక యువతి ట్రాలీ సూట్ కేస్ తో రైల్వే ప్లాట్ ఫాం పై  అనుమానాస్పదంగా సంచరించడం, ఆ సూట్ కేస్ నుండి రక్తం కారుతుండడం గమనించిన రైల్వే పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించగా ఈ ఘోరం వెలుగు చూసింది. పోలీస్ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం..స్వర్ణకారుడు అయిన సుబ్రహ్మణ్యం తన కుటుంబంతో వృద్దురాలు రమణి ఇంటికి సమీపంలోనే నివసిస్తున్నాడు. రమణి ఒంటిపై ఉండే బంగారు నగలను చూసి దుర్భుద్ది పుట్టి, అవి ఎలాగైనా కాజేయాలని పథకం వేసాడు. దానికి అనుగుణంగా సుబ్రహ్మణ్యం అతని కుమార్తె దివ్య ఇద్దరూ కలిసి ఆరోజు కూరగాయల కోసం బయటకు వచ్చిన రమణిని తమకు ఉన్న ముఖ పరిచయంతో ఇంటికి ఆహ్వానించారు. వారి ఆహ్వానంలోని మర్మం గమనించని వృద్దురాలు వారి ఇంటికి వెళ్ళింది. తమ పన్నాగంలో చిక్కిన ఆమెను దుప్పటితో ముఖంపై అదిమిపెట్టి, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసారు. అనంతరం ఆమె ఒంటిపై నగలను తీసుకొని, శవాన్ని మాయం చేసే ప్రణాళికలో భాగంగా ముక్కలుగా నరికి ఒక ట్రాలీ సూట్ కేస్ లో ఇరికించారు. ఆ సూట్ కేస్ తీసుకుని తండ్రీ,కుమార్తె నెల్లూరు నుండి చెన్నై వెళ్ళే ట్రైన్ ఎక్కారు. మార్గ మధ్యంలో ఆ సూట్ కేస్ ను ఎక్కడైనా పడేద్దామన్న పథకం తగిన అవకాశం చిక్కకపోవడంతో అమలు చేయలేక పోయారు. చెన్నైలో దిగి మళ్ళీ నెల్లూరు వెళ్ళే ట్రైన్ ఎక్కి ఈసారైన సూట్ కేస్ ని వదిలించుకుందామని ఆ తండ్రి, కూతురు చేస్తున్న ప్రయత్నం రైల్వే పోలీసులు రంగంలోకి దిగడంతో భగ్నం అయ్యింది. సినిమాలు, నవలలు, వెబ్ సిరీస్ లలోను కనిపించే భయానక, హింసాత్మక సీన్ లను నిజ జీవితంలో వాస్తవంగా చేసి చూపించిన ఆ నర రూప రాక్షసులను చూసి పోలీసులే హడలెత్తి పోయారు. సినిమాలు చూసి ఈ తరహా  ఘోరాలకు పాల్పడుతున్నారా..? వాస్తవ సమాజంలో జరుగుతున్న ఇటువంటి అమానుషాలే సినిమాలు, నవలలు, వెబ్ సిరీస్ లకు కథా వస్తువులు అవుతున్నాయా..? అన్నది ఎన్నటికీ  జవాబు దొరకని  ప్రశ్న. ఏది ఏమైనా చిన్న కారణాలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కోరికలు, ఆశలు, అహం సంతృప్తి పరచుకోవడానికి ఎంతో విలువైన ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నామన్న తలపే ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తుంది. ఈ విషాద ఘటన నేర్పుతున్న పాఠం. అపరిచితులతో అతి చనువు ప్రమాదం. చిన్న పిల్లలు, వృద్దుల వంటి అసహాయుల ఒంటిపై విలువైన ఆభరణాలు ఉన్నప్పుడు ఒంటరిగా బయటకు పంపకూడదు. అప్రమత్తం..! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి